టాలీవుడ్ అగ్ర కథానాయిక, మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు కేరాఫ్ స్వీటీ అనుష్క ఈ మధ్య సినిమాల్లో నెమ్మదించింది. కథల ఎంపికలో ఎప్పుడు ఆచితూచి అడుగులేస్తుంది. ఏ పాత్ర పడితే అది చేయకుండా వచ్చిన అవకాశాల్లో తనకు ఏది నప్పుతుందో చూసుకుని మాత్రమే సినిమాలు అంగీకరిస్తుంది. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత తన తాజా చిత్రంపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే ఆమె తెలుగులో ఇప్పటికే ఓ చిత్రాన్ని సైలెంట్‌గా పట్టాలెక్కించినట్లు తెలిసింది. ఈ చిత్రం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్నట్లు, యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నట్లు సమాచారం. క్రిష్ శైలికి తగ్గట్టు ఓ బలమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని.. ఛాలెంజింగ్ పాత్రను అనుష్క పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అనుష్క మలయాళంలో ‘కథనార్’ అనే చిత్రంలో నటిస్తోంది. మలయాళంలో ఆమె నటిస్తున్న తొలి చిత్రమిది. క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీర మల్లు’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆ చిత్రం డిలే అవుతోంది. ఈ గ్యాప్ లో క్రిష్ ఓ చిత్రం చేయాలనే భావనతో అనుష్కతో సినిమా చేస్తున్నట్లు తెలిసింది.