–నాగారంలోని కేజీఆర్ ఇన్స్టిట్యూట్లో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహణ
నాగారం, జూలై01 (ప్రజాజ్యోతి):
కీసర మండలంలోని నాగారం గ్రామంలోని కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఫార్మసీ విభాగం ఆధ్వర్యంలో, ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (ఐపీజీఏ) తెలంగాణ శాఖ సహకారంతో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రసూతి, స్త్రీరోగ నిపుణురాలు డాక్టర్ దీప్తి దండమూడి ముఖ్య అతిథిగా హాజరై “వైద్యుల సూచనలకు అతీతంగా వైద్యులు మరియు ఫార్మసిస్టుల సమన్వయం ద్వారా రోగులకు మెరుగైన ఆరోగ్య ఫలితాలు” అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యులు సరైన వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తే, ఫార్మసిస్టులు మందుల సరైన వినియోగం, మోతాదు, దుష్ప్రభావాలు, ఔషధాల పరస్పర ప్రభావాలపై అవగాహన కల్పించడం ద్వారా చికిత్స విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషిస్తారని వివరించారు. వైద్య సేవల్లో బృంద సమన్వయం, నైతిక విలువలు, రోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం మాట్లాడుతూ వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టుల బాధ్యత రోజురోజుకూ పెరుగుతోందని, విద్యార్థులు తమ వృత్తి జీవితంలో సేవా దృక్పథంతో పాటు నైతిక విలువలను అలవరచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అన్ని విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఫార్మసీ విభాగ అధ్యాపకులు, విద్యార్థి మండలి సభ్యులు, విద్యార్థి ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని
విజయవంతం చేశారు. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థి మండలి సభ్యులు సమన్వయంతో వ్యవహరించి అతిథుల స్వాగతం, సభ నిర్వహించారు అలాగే విద్యార్థుల భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథిని కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. విద్యార్థులతో నిర్వహించిన పరస్పర చర్చలో వైద్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఫార్మసిస్టుల విస్తరిస్తున్న బాధ్యతలు, రోగి భద్రతకు సంబంధించిన అంశాలపై పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యంతో పాటు సేవాభావం, బాధ్యతాయుతమైన ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.