హైదరాబాద్ , ప్రతినిధి : ఎంసెట్ వివాదం ముదురుతోంది. ఉమ్మడిగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంటే..మా పరీక్షలు మేమే నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీనిని టి.సర్కార్ వ్యతిరేకించింది. తాము సపరేట్ గా నిర్వహిస్తామని పేర్కొంది. అందులో భాగంగా నేడు షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ ప్రభుత్వం హైకోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధపడుతోంది. అంతకంటే ముందు గవర్నర్ నరసింహన్ తో మంత్రి గంటా భేటీ కానున్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి అడ్మిషన్లు కొనసాగించాల్సి ఉన్న నేపధ్యంలో ఎంసెట్ నిర్వహణ కూడా ఉమ్మడిగానే నిర్వహించాలని మంత్రి గంటా పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విభజన చట్టాన్ని పాటిస్తూ ముందుకు పోతున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలా అనాగరికంగా వ్యవహరించి గొడవలు సృష్టించడం లేదని టి. మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొంటున్నారు.