కోల్ కత , ప్రతినిధి : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్ మీటింగ్‌లో ఓ యువకుడు.. ఆయన చెంప చెళ్లుమనిపించాడు. బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా చందీపూర్‌లో ఆదివారం ఆ పార్టీ ర్యాలీ జరిగింది.
ఎంపీ అభిషేక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. హఠాత్తుగా వేదికపైకి వచ్చిన ఆ యువకుడు.. ఎంపీని చెంపదెబ్బ కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని.. ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పట్టుకుని చితకొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఐతే, దాడి చేసిన యువకుడు ఎవరు..? ఎందుకు ఇలా ప్రవర్తించాడన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అభిషేక్ కొనసాగుతున్నాడు.