హైదరాబాద్, ప్రతినిధి : ‘గోపాల గోపాల’ఆడియో ఫంక్షన్‌లో అపశృతి చోటుచేసుకుంది. తమకు టికెట్లు ఇవ్వలేదని పవన్‌కల్యాణ్ అభిమాని శ్రీనివాస్ అనే వ్యక్తిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కత్తితో గొంతు కోసి పాస్‌లు లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ఆసుపత్రిలో కోలుకుంటుండగా.. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేది మిస్టరీగా మారింది.
ఆదివారం సాయంత్రం శిల్పకళావేదిక వద్ద ఒక్కసారిగా అలజడి రేగింది. గోపాల గోపాల ఆడియో ఫంక్షన్ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన గుంటూరు జిల్లా గంటావారిపాలెంకు చెందిన కరుణ శ్రీనివాస్‌ని దుండగులు కత్తితో గొంతు కోసి పరారయ్యారు. శిల్పకళా వేదిక గేట్ నెంబర్ 1 వద్ద ఈ ఘటన జరిగింది. పాస్‌లు లాక్కోవడంతోపాటు మెడలోవున్న బంగారు గొలుసు కూడా ఎత్తుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను దగ్గరలోవున్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు చెబుతున్నారు. ఐతే శ్రీనివాస్‌పై దాడి చేసిందెవరనేది మిస్టరీగా మారింది. అతని దగ్గరున్న పాస్‌ల కోసమే ఈ దాడి జరిగిందా..? లేక మరేవైనా కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీకెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.