జర్నలిస్టులకు మంచి రోజులు…
మాట నిలుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి…
జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్న చైర్మన్ ..
కరీంనగర్ లో జర్నలిస్టుల సంబురాలు…
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టంలో దశాబ్దకాలంగా తమ సమస్యలు పరిష్కారం కాక నీరసంతో నిరుత్సాహపడిన జర్నలిస్టులకు మంచి రోజులు రానున్నాయి. ఇళ్ళ స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు సహా ప్రతీ సమస్యను నాన్చివేతకు గురి చేస్తూ జర్నలిస్టులకు దశాబ్దకాలంగా బీఆర్ఎస్ పాలకులు అవమానాలకు గురి చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు జర్నలిస్టుల సమస్యలపై స్పందిస్తూ త్వరలోనే మీడియా అకాడమీ చైర్మన్ ను నియమిస్తామని ప్రకటించి నాలుగు రోజులు గడవకముందే సీనియర్ జర్నలిస్టు, ఐజేయూ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డికి చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ లోనే సమాచారం అందుకున్న శ్రీనివాస్ రెడ్డిని పలువురు జర్నలిస్టులు ఘనంగా సన్మానించి సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు.. ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా ఉంటుంది. శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ప్రజాపక్షం పత్రికకు ఎడిటర్ గా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆయన విశాలాంధ్ర పత్రికకు ఎడిటర్ గా పని చేశారు. సీనియర్ జర్నలిస్టుగా.. జర్నలిస్ట్ సంఘం నాయకుడిగా శ్రీనివాస్ రెడ్డి పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాత్రికేయుల సమస్యలపై పోరాటాలు చేశారు.. 1996 -97లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉమ్మడి రాష్ర్ట స్థాయిలో పని చేసి అనేక సంస్కరణలు చేపట్టారు. క్రిందిస్థాయిలో జర్నలిస్టులకు శిక్షణ, మెళుకువల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత యూనియన్ కార్యకలాపాల్లో పూర్తి స్థాయి నిమగ్నమయ్యారు. రాష్ర్ట, జాతీయ స్థాయిలో కీలక పదవులు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జాతీయ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి నియామకం పట్ల రాష్ర్ట వ్యాప్తంగా జర్నలిస్టులు, యూనియన్ నేతలు హర్షాతిరేకాలు వెలిబుచ్చుతున్నారు.