పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో ఇక మిగిలింది ముగ్గురే ముగ్గురు! మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ కాకా వెంకటస్వామి మనవడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ సుగుణ కుమారి, ప్రముఖ వ్యాపారవేత్త, మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాసులు ప్రధానంగా పోటీపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం రూపొందించిన షార్ట్ లిస్టులో ఈ ముగ్గురి పేర్లే ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ లో చేరేటప్పుడు తమకు హామీ ఇచ్చిన విధంగానే తన తనయుడికి పెద్దపెల్లి ఎంపీ టిక్కెటు ఇవ్వాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పట్టుపడుతున్నట్లు సమాచారం. అయితే గడ్డం వంశి అభ్యర్థిత్వాన్ని నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ డాక్టర్ సుగుణ కుమారి లేదా స్థానిక నాయకుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి శ్రీధర్ బాబు అధిష్టాన వర్గానికి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. డాక్టర్ సుగుణ కుమారి స్థానికంగా ఉండకుండా దుబాయ్ లో సెటిలైపోయిందని , రేపు పార్టీ టికెట్ రాకపోతే తిరిగి దుబాయ్ కి వెళ్ళిపోతుందని ప్రచారం సాగుతోంది. గడ్డం వంశీ సైతం స్థానికంగా ఉండడని పార్టీ టిక్కెట్టు ఇచ్చిన ఇవ్వకపోయినా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే ఉంటారని కార్యకర్తలకు అందుబాటులో ఉండరని చర్చ సాగుతోంది. గోదావరిఖనికి చెందిన స్థానిక నాయకుడు ఆసంపల్లి శ్రీనివాస్ పార్టీ టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా స్థానికంగానే ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పలువురు కార్యకర్తలు భావిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని పలువురు మాదిగ ఐక్యవేదిక నాయకులు కోరుతున్నారు. నాగర్ కర్నూలు , వరంగల్ లోక్ సభ టికెట్లను మాల సామాజిక వర్గానికి కేటాయిస్తే పెద్ద పల్లి కచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తుందని డాక్టర్ సుగుణ కుమారి లేదా ఆసంపల్లి శ్రీనివాసులకు టికెట్ ఇస్తారని చర్చ కొనసాగుతోంది.