సమష్టిగా పనిచేసి అఖండ విజయాన్ని అందించండి
ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. దశలవారీగా హామీలను నెరవేరుస్తున్నాం
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి
పార్టీ శ్రేణులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం
సర్పంచులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు జూపల్లి, వివేక్ వెంకటస్వామి
(పొలిటికల్ ఫ్యాక్టరీ – చెన్నూరు )
చెన్నూర్, జనవరి 19: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సోమవారం చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల పరిచయ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై మంత్రి జూపల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, గత పదేళ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను ఆర్థికంగా అధోగతి పాలు చేశారని ద్వజమెత్తారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో నెరవేరుస్తోంది” అని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీ కాలం ఉందని, ఈ లోపు మిగిలిన అన్ని వాగ్దానాలను అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. “తులం బంగారం, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఆ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలి” అని దిశానిర్దేశం చేశారు.
పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని మున్సిపాలిటీల ఎన్నికల ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న మంత్రి జూపల్లి.. రాబోయే ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫలాలను ప్రతి గడపకూ చేరవేసి, పార్టీ బలపడేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నూతన సర్పంచులు పాల్గొన్నారు.