-సంక్రాంతి వేళ అద్భుతం
రంగారెడ్డి, ప్రతినిధి : సంక్రాంతి వేళ అద్భుతం జరిగింది. బోరుబావిలో పడిన బాలిక ప్రాణాలతో బయటపడింది. చిన్నారి అంజలి సురక్షితంగా బయటపడడంతో ఆ ఇంట్లో సంతోషం నెలకొంది. రెస్క్యూ టీమ్ కష్టపడి చిన్నారిని రక్షించడంతో గ్రామస్తులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గోవింద్‌పల్లితండాలో బోరుబావిలో పడ్డ చిన్నారి
రంగారెడ్డి జిల్లా గండ్వీడ్ మండలం గోవింద్‌పల్లితండాలో ఐదేళ్ల చిన్నారి అంజలి బోరుబావిలో పడింది. పాప తండ్రి కాశావత్ లక్ష్మణ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లగా.. తల్లి పుణె వెళ్లింది. అంజలి- అమ్మమ్మ, తాతయ్యలు దగ్గర ఉండి చదువుకుంటోంది. సంక్రాంతి సెలవులు కావడంతో మంగళవారం ఉదయం అమ్మమ్మ కోసం అంజలి పొలం వద్దకు వెళ్లింది. ఆడుకుంటూ వెళ్లిన పాప ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది. ఇంటికి వచ్చిన అమ్మమ్మకు పాప జాడ తెలియకపోవడంతో.. చుట్టుపక్కలంతా వెతికారు. ఇక లాభం లేదనుకుని చివరకు బోరు వద్దకు వచ్చి చూశారు.. అందులోనుంచి ఏడుపులు వినిపించాయి. వెంటనే స్థానికులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
సాయంత్రం ఆరు గంటల సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పాపను సురక్షితంగా రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. 10 అడుగుల లోతున్న బోరుబావికి సమాంతరంగా జేసీబీతో గుంత తవ్వారు. మరోవైపు ఆక్సిజన్ అందిస్తూనే పాపను రక్షించేందుకు ప్రయత్నించారు. రాత్రి 8 గంటల సమయంలో పాపను సురక్షితంగా బయటకు తీయగలిగారు. వెంటనే ప్రథమ చికిత్స అందించి 108 వాహనంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఫలించిన రెస్క్యూ టీం ఆపరేషన్…
రెస్క్యూ టీమ్ శ్రమ ఫలించింది. రెండు గంటల పాటు కష్టించి బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీయగలిగారు. పాప ప్రాణాలతో బయటపడడంతో అమ్మమ్మ, తాతయ్యలతో పాటు గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు. పాపను రక్షించడంతో తమకు నిజమైన సంక్రాంతి వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.