స్వర్ణభారత్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్
నెల్లూరు, ప్రతినిధి : పవన్ మొదటిసారి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని తన ప్రసంగంతో అదరగొట్టారు. ‘‘స్వచ్ఛభారత్ అంటే ఫొటోలు తీసుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే పరిశుభ్రమైన సమాజం అవతరిస్తుంది’’ అని సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘సంక్రాంతి సంబరా’ల్లో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. తనదైన శైలిలో నేతలకు చురకలు అంటిస్తూ పవన్ కల్యాణ్ ప్రసంగం సాగింది. స్వచ్ఛ భారత్ అంటే.. భారతీయ జనతా పార్టీనో, ప్రధాని మోదీనో కాదు. ప్రతి భారతీయుడి భాగస్వామ్యం ఉన్నప్పుడే అది సాధ్యం. సంవత్సరంలోనో లేదంటే ఐదేళ్లలోనో భారత్‌ను పరిశుభ్ర దేశంగా మార్చడం కుదిరే పనికాదు. భారతదేశం ఉన్నంతకాలం ఈ కార్యక్రమం కొనసాగాలి’’ అని తెలిపారు. ‘‘స్వచ్ఛ భారత్ గురించి మోదీ మాటలు విన్నప్పుడు నేను కూడా అనుమానించాను. ఇది సాధ్యమా అని అనిపించింది. అయితే, దాన్ని సాధ్యం చేయడం ఒకరిద్దరితోనే అయ్యేది కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యత పడాల్సి ఉంటుందని ఆ తరువాత తెలుసుకొన్నాను. అందువల్లనే నా వంతుగా నేను స్వచ్ఛభారత్‌లో పని చేస్తాను. నా అభిమానులకు కూడా ఇదే పిలుపునిస్తున్నాను’’ అని చెప్పారు. దేశంలో ఇల్లు లేకపోయినా ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్లు కనిపిస్తున్నాయని, కానీ, కనీస అవసరాలను మాత్రం తీర్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సిద్ధాంతం కోసం నిలిచే నేత అని, విభజనపై ఆయన ఒక్కరే పార్లమెంటులో పోరాడారని గుర్తు చేశారు.
‘‘నేను నెల్లూరులోనే పుట్టి పెరిగాను. చిన్నతనం నుంచి వెంకయ్యనాయుడును చూస్తున్నాను. మా నాన్న ఆయనతో కలిసి జై ఆంధ్రా ఉద్యమంలో పోరాడారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను వెంకయ్య నెల్లూరుకు తీసుకువచ్చారు’’ అని చెప్పారు.