హైదరాబాద్: ప్రముఖ నటుడు జగపతిబాబు తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్(82) సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్న ఆయన ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు.
వీబీ రాజేంద్రప్రసాద్ పూర్తి పేరు వీరమాచినేని బాబూ రాజేంద్రప్రసాద్. కృష్ణా జిల్లా గుడివాడలో 1932 నవంబర్ 4న ఆయన జన్మించిన రాజేంద్రప్రసాద్ నటుడు అవ్వాలని వచ్చినిర్మాతగా స్థిరపడ్డారు. తర్వాత దర్శకుడిగా మారారు. దసరా బుల్లోడు సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. 14 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. రెండు సినిమాలకు రచన చేశారు. 16 సినిమాలు నిర్మించారు.
దసరా బుల్లోడు, బంగారు బాబు, భార్యాభర్తల బంధం, ఆస్తిపరులు, అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అక్కాచెల్లెలు, రామకృష్ణులు, పిచ్చిమారాజు, కెప్టెన్ నాగార్జున తదితర సినిమాలు తీశారు. అక్కినేని నాగేశ్వరరావుతో వీబీ రాజేంద్రప్రసాద్ ఎక్కువ సినిమాలు తీశారు. అంతస్థులు సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం అందుకున్నారు. సింహస్వప్నం ద్వారా తన తనయుడు జగపతిబాబును వెండితెరకు పరిచయం చేశారు. 2000లో కెవి రెడ్డి పురస్కారం అందుకున్నారు వీరమాచినేని బాబూ రాజేంద్రప్రసాద్.