మన దేశంలో మారుతీ కారుకున్న క్రేజే వేరు. అందులోనూ అందమైన మోడల్, ఆకర్షణీయమైన మైలేజీ ఆఫర్ ఉన్న మోడల్ కార్లు పకోడీల్లా అమ్ముడు పోతాయి. మారుతీ లేటెస్ట్ మోడల్ సియాజ్ విషయంలో అదే జరుగుతోంది. దీని బుకింగ్స్ ను నాలుగు రోజుల కిందట మొదలు పెట్టారు. సగటున రోజుకు 1000 కార్లు బుక్ అవుతున్నాయి. రోడ్డు మీద దీని పని తీరు ఎలా ఉంటుందో అని కొందరు ఆటో మొబైల్ నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు.
కొనుగోలు దారులు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. వేల సంఖ్యలో ఈ కారు గురించి ఎంక్వయిరీ చేశారు. రోజుకు 1000 మంది బుకింగ్స్ చేసేస్తున్నారు. అయినా ఇది వెంటనే చేతికి రాదు. వచ్చే నెల మొదటి వారంలో మార్కెట్లోకి వస్తుంది. మోడల్ బాగుంది. మైలేజీ ఆఫర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంకేం కావాలి.
కొత్తగా మాంచి కారును కొందామనుకునే వారు చాలా మందికి ఇదే మంచి ఆప్షన్ అనిపిస్తోంది. అంతే కాదు, వేరే కారు బుక్ చేసిన కొందరు దాన్ని రద్దు చేసి మారుతీ సియాజ్ కొందామని నిర్ణయించుకున్నారు. అంతలా దీని మీద క్రేజ్ ఏర్పడటానికి కారణం, దీని పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.73 కిమీ మైలేజీ ఇస్తుందట. డీజిల్ వెర్షన్ 26.21 కిమీ మైలేజీ ఇస్తుందట.
ఇక దీని ధర విషయానికి వస్తే మరీ తక్కువేమీ కాదు. రూ. 7.5 లక్షల నుంచి 10.5 లక్షల మధ్య లభిస్తుంది. అయినా ఎగువ మధ్య, సంపన్న కొనుగోలుదారులు పోటీ పడి మరీ బుక్ చేసుకుంటున్నారు. మారుతీ కొత్త మోడల్ ను సూపర్ సక్సెస్ చేస్తున్నారు