-బాబాలు, గురువులు, స్వాములపై ఆర్కే ఫైర్..
-తొలిసారి రాజకీయ నాయకుల ప్రస్తావన లేని వ్యాసం
(అయిలు రమేశ్, హైదరాబాద్)
ఎప్పుడూ కేసీఆర్ ను తిట్టడం.. చంద్రబాబును పొగడడమేనా.. అందుకే ఈసారి ఆర్కే తన అస్ర్తాలను బాబాలు, స్వాములు, పీఠాదిపతులపై ఎక్కుపెట్టారు. పీకే సినిమా చూసి ఇన్ స్పైర్ అయ్యారో ఏమో తెలీదు కానీ.. పీకే సినిమాలాగే పదునైన వ్యాఖ్యలతో దొంగస్వాములను కడిగిపారేశారు. ప్రజాప్రతినిధులు , ప్రజలు బాబాలను ఆకాశానికెత్తేస్తున్నారని మండిపడ్డారు.. ప్రజల అమాయకత్వంతో బాబాలు ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు..
ప్రతీవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆదివారం పూట ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ ‘కొత్త పలుకు ’ శీర్షికన సమకాలీన రాజకీయాలపై ఎడిటోరియల్ రాస్తూ రాజకీయ లూఫ్ హోల్స్ ను కడిగిపారేస్తుంటారు. ప్రతీవారం రాజకీయ నాయకుల్ని తప్పుల్ని ఎత్తిచూపడం.. వాటిని నిలదీయడం చేస్తుంటారు. చివరకు మీరు మారడంటూ హితబోధ చేస్తుంటారు. ఆయన వ్యాసాలు ఎప్పుడు పొలిటికల్ రౌండప్ మీదే ఎక్కువగా సాగుతుంటాయి.. కానీ ఈ ఆదివారం సంచికలో కొత్తగా రాజకీయ నాయకులకు సంబంధం లేని ఒక కొత్త అంశంపై ఆయన రాసిన వ్యాసం అందరినీ ఆకట్టుకుంది. దొంగ బాబాలు, స్వాములు, వారి వైఖరి వారు చెపుతున్న మాటల్ని ఉటంకిస్తూ ఆయన రాసిన వ్యాఖ్యలు సమాజంలో హిందుత్వం పేరు మీద జరుగుతున్న అరాచకాలను కళ్లకు కట్టింది. నిజంగానే ఇది కొత్తగా పలికారని అందరూ ప్రశంసిస్తున్నారు.