-బుధవారం నుంచి అమిత్ షా పర్యటన
హైదరాబాద్ , ప్రతినిధి : బిజెపి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత.. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బిజెపి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కు కమలనాథులు తెరలేపారు.
బుధవారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బుధవారం రాత్రికి ఆయన హైద్రాబాద్ చేరుకుంటారు. గురువారం ఉదయం 8గంటల 30 నిమిషాలకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. తర్వాత 11 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇది ముగించుకొన్న తర్వాత పంజాగుట్టలోని సెస్ బిల్డింగ్ చేరుకుంటారు. అక్కడ సాయంత్రం ఐదు గంటల వరకూ పార్టీ శ్రేణులతో సమావేశమై… సభ్యత్వ నమోదుపై సమీక్షిస్తారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు.
మాజీ సీఎం కిరణ్ బీజేపీలో చేరిక వాయిదా?
హైదరాబాద్‌లో టూర్ ముగించుకొని… గురువారం రాత్రికి అమిత్‌షా విజయవాడ చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ సంధర్బంగానే.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన పలువరు నేతలు బిజెపిలో చేరనున్నారు. ఇదే టూర్ లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతన్నా.. అది ప్రస్తుతానికి వాయిదా పడినట్లు సమాచారం.