అడిలైడ్, ప్రతినిధి : భారత్,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో అతిపెద్ద ప్రమాదం తప్పింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి చావుతప్పినంత పనయ్యింది. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఫిల్ హ్యూస్ బౌన్సర్ దెబ్బతో నెలకొరిగి విలువైన ప్రాణాలను కోల్పోయిన దుర్ఘటనను క్రికెట్ ప్రపంచం మరచిపోకముందే అలాంటి మరో సంఘటనే చోటు చేసుకొని చివరకు సుఖాంతంగా ముగిసిపోయింది.
అసలు ఏం జరిగింది..?
టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ ను కంగారూ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ పడగొట్టిన వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కొహ్లీకి ఓ భయంకర అనుభవం ఎదురయ్యింది. ఇన్నింగ్స్ 31వ ఓవర్ రెండోబంతిని క్విక్ బౌలర్ మిచెల్ జాన్సన్ గంటకు 89 కిలోమీటర్ల వేగంతో సంధించాడు. ఆ బంతిని ఎదుర్కొన్న విరాట్ బౌన్స్ ను పొరపాటుగా అంచనా వేశాడు. దీంతో ఆ ఎక్స్ ప్రెస్ డెలీవరీ కాస్త వచ్చి తలపైన ఉన్న హెల్మెట్ ను బలంగా తాకింది.
కొద్ది క్షణాలు నిశ్శబ్ధం..
దీంతో కొద్ది క్షణాలపాటు కొహ్లీ షాక్ కు గురై తేరుకోలేకపోయాడు. ఆ వెంటనే సమీపంలో ఉన్న ఆస్ట్రేలియా ఫీల్డర్లు క్రిస్ రోజర్స్, డేవిడ్ వార్నర్, వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ వచ్చి కొహ్లీని పరామర్శించారు. మరోవైపు షార్ట్ పిచ్ బాల్ సంధించిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఆందోళనతో కొహ్లీ దగ్గరకు వచ్చాడు. ఒక్కసారిగా అడిలైడ్ ఓవల్ గ్రౌండ్లో నిశ్శబ్దం ఆవరించింది. అయితే కొహ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే తేరుకోడంతో రెండుజట్ల సభ్యులు, స్టేడియంలోని అభిమానులు, కామెంటేటర్లు ఊపిరిపీల్చుకొన్నారు.
క్రీడా స్ఫూర్తి..
కొహ్లీని పరామర్శించడం ద్వారా కంగారూ జట్టు సభ్యులు, మరియు బౌలింగ్ చేసిన మిషెల్ జాన్సన్ తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. కొహ్లీకి షార్ట్ పిచ్ బాల్ వేసిన జాన్సన్ ఒక్కసారిగా బిత్తరపోడంతో కంగారూ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వచ్చి భుజంతట్టి అతనికి ధైర్యం చెప్పాడు. మొత్తం మీద అడిలైడ్ ఓవల్ లో సైతం అతిపెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది.