కాంగ్రెస్ సర్కారు అన్నివిభాగాల్లో కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు బదిలీలకు శ్రీకారం చుట్టింది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఏండ్ల నుంచి కీలక స్థానాల్లో ఉన్న వారికి స్థాన చలనం కలుగుతున్నది. అవినీతికి చెక్ పెట్టడంతోపాటు పారదర్శకంగా పాలన అందించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కీలక ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ఎత్తిపోతల (రామగుండం) ఇఎన్సీగా కొట్టె సుధాకర్రెడ్డిని నియమించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు అక్కడ పని చేసిన నల్లా వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఇటీవల పదవి నుంచి తొలగించింది. జగిత్యాలలో ఇరిగేషన్ శాఖ సీఈగా ఉన్న సుధాకర్రెడ్డికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. మేడిగడ్డ బరాజ్ మరమ్మతు పనులు ఆయన ఆధ్వర్యంలో సాగనున్నాయి.