ఆసక్తి రేపుతున్న పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్
కొత్తవారికేనా అవకాశం?
పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఎవరికి లభిస్తుందో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. సాధారణంగా ఈ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ‘ఎవరో ఒకరు వస్తారు.. గెలిపిస్తాం’అనే విధంగానే ఉండేది. కానీ ఈసారి విచిత్రంగా స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలి, అందులో రిజర్వేషన్ కేటగిరీలో అత్యధిక జన సముదాయం ఉన్న వర్గానికే ఇవ్వాలి అనే డిమాండ్ బాగాపెరిగిపోయింది. స్థానిక ప్రజలలో కూడా ఈ భావన వ్యాపించడం విశేషం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ, సింగరేణి గనులు వ్యాపించి ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఈసారి అర్హత కలిగిన స్థానిక నాయకుడికి అవకాశం ఇవ్వాలన్న భావనను గమనించిన పార్టీల అధినేతలు అదే వైపున ఆలోచిస్తున్నారని సమాచారం. ఈసారి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు అధికంగా ఉండడంతో ఆ పార్టీ టికెట్ కు డిమాండ్ పెరిగింది. దరఖాస్తులు కూడా అధికంగానే వచ్చాయి. అధిష్టానం వాటిని పరిశీలించి ఐదుగురితో కూడిన ఒక సూక్ష్మ జాబితాను తయారు చేసింది. చివరకు ప్రధాన పరిశీలనలో ఇద్దరు మాత్రమే ఉన్నారని సమాచారం. మాల వర్గం నుంచి టిక్కెట్ ఇవ్వాలనుకుంటే గడ్డం వంశీ, మాదిగ వర్గం నుంచి ఇవ్వాలనుకుంటే ఆసంపల్లి శ్రీనివాస్ జాబితాలో మిగిలారని తెలుస్తోంది.
వారికి నిరాశేనా
గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన చెలిమల సుగుణ కుమారి కొంతకాలం విదేశాలలో ఉండి ఇటీవలనే స్వదేశానికి తిరిగి వచ్చారు ఆమె ఇక్కడ నుంచి తిరిగి పోటీ చేయడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నప్పటికీ, అధిష్టానం అంతగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు టికెట్ ఇచ్చే విషయంలో కొంత చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఈసారి కొత్తగా అనుభవంలోకి వస్తున్న స్థానికత అంశం కాంగ్రెస్ అధిష్టానాన్ని కొంత ఆలోచనలో పడవేసిందని చెబుతున్నారు. దీంతో ఐదుగురి జాబితాను రెండుకు తగ్గించి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆసంపల్లి శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చినట్టయితే గెలుపు సులభం అవడమే కాకుండా స్థానిక నాయకుడికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని పార్టీ శ్రేణులు కూడా అధిష్టానానికి విన్నవిస్తున్నారని తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు
ఎన్నికల షెడ్యూలు విడుదల అయ్యేలోపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మెజారిటీ స్థానాలలో ఎంపీలను గెలిపించుకొని తెలంగాణలో సత్తా చాటడమే కాకుండా, అధిష్టానానికి చక్కని బహుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు భావిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తెర వెనుక పావులు కదుపుతూ గెలుపు గుర్రాల వేటలో పడిపోయారు. ‘ఎవరో ఒకరికి’అనే ప్రాతిపదికగా కాకుండా గెలుపు అవకాశాలు ఉండి అభివృద్ధిలో పాలు పంచుకునే ఆసక్తి కలిగినవారిని ఎంపిక చేయాలనే ఆలోచన రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వంలో కూడా ఉందని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే స్థానికులు, స్థానిక కార్యకర్తల కోరుకున్నట్టు ఆసంపల్లి శ్రీనివాస్ కు టికెట్ లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి
‘ఆసంపల్లి’కి రేణుక హామీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్ శనివారం రేణుకా చౌదరిని కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. రేణుకా చౌదరిని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే ఆసంపల్లి శ్రీనివాస్ రేణుకను కలుసుకున్నారు. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి తనకు కాంగ్రెస్ టికెట్ లభించేలా సహకరించాలని కోరారు. అందుకు ఆమె కూడా సమ్మతించినట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి దీపా దాస్ మున్షి ని కలిసిన ఆసంపల్లి శ్రీనివాస్ పెద్ద పల్లి ఎంపీ కాంగ్రెస్ టిక్కెట్ తనకు కేటాయించాల్సిందిగా శనివారం నాడు వినతి పత్రం అందజేశారు.