ప్రముఖ వ్యాపారవేత్త, మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాస్ కు పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ టికెట్ ఖరారు అయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆసంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అనుచరుడుగా కొనసాగుతున్నారు.మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నాయకుడు కావడమే ఆసంపల్లి శ్రీనివాస్ కు ప్లస్ పాయింట్ గా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలైన టిఆర్ఎస్ మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు టికెట్ కేటాయించగా, భారతీయ జనతా పార్టీ నేతకాని సామాజిక వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ కు పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదట మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకి పార్టీ టిక్కెట్ ఇవ్వాలని భావించినా ఆయన అభ్యర్థిత్వాన్ని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం లోని నలుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నాన్ని అధిష్టాన వర్గం విరమించుకున్నట్లు తెలిసింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ సుగుణకుమారి, మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాసులలో ఒకరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే సింగరేణి కార్మికుని బిడ్డగా, స్థానికుడిగా ఆసంపల్లికి మంచి పేరు ప్రతిష్టలు ఉండడంతో శ్రీనివాస్ కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తే విజయం గారెంటీ అనే భావనతో అధిష్టాన వర్గం ఉన్నట్లు సమాచారం. పెద్ద పల్లి పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే ప్రతిసారి కొత్త అభ్యర్థులకే పెద్దపల్లి ప్రజలు విజయం చేకూర్చిన చరిత్ర ఉంది. పెద్దపెల్లి ఎంపీగా ఉన్న కాకలు తీరిన కాక గడ్డం వెంకటస్వామి ని కొత్తగా వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణ కుమారి ఓడించిన చరిత్ర గతంలో ఉంది. ఆ తర్వాత గడ్డం వివేక్ , బాల్క సుమన్ , వెంకటేష్ నేత కొత్త అభ్యర్థులుగానే విజయం సాధించారు. ఇప్పుడు ఆసంపల్లి శ్రీనివాస్ కూడా ఫ్రెష్ అభ్యర్థి కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం .కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం కూడా ఎలాంటి రిమార్కులు లేని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ కు పెద్దపెల్లి ఎంపీ టికెట్ ఇచ్చి ఘన విజయం సాధించాలనే కృతనిచ్చేయంతో ఉన్నట్లు సమాచారం.