*ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షల నిర్వహణ
*పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి
పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి
10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎస్
——————————
కరీంనగర్ ఫిబ్రవరి- 24:
——————————
ఇంటర్ పరీక్షలను రాష్ట్రంలో కట్టుదిట్టంగా నిర్వహించాలని సి.ఎస్.కే రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం సీఎస్ కె.రామ కృష్ణ రావు ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ కె.రామ కృష్ణ రావు మాట్లాడుతూ, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించాలని స్పష్టం చేశారు.
పరీక్ష కేంద్రాలకు ఎవరికీ సెల్ ఫోన్ తీసుకుని రావడానికి అనుమతి లేదని, సీసీ కెమెరాల సమక్షంలోనే ప్రశ్నాపత్రాలు సీల్ ఓపెన్ చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేయాలని అన్నారు.
పరీక్ష కేంద్రాలకు ప్రవేశద్వారం వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని,పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందించాలని, అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా ఆర్టీసీ బస్సులు పరీక్షా కేంద్రాల రూట్ లలో స్పెషల్ బస్సులు నడపాలని అన్నారు.
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.