(పొలిటికల్ ఫ్యాక్టరీ – గోదావరిఖని )
పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఎవరికి లభిస్తుందో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. సాధారణంగా ఈ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ‘ఎవరో ఒకరు వస్తారు.. గెలిపిస్తాం’అనే విధంగానే ఉండేది. కానీ ఈసారి విచిత్రంగా స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలి, అందులో రిజర్వేషన్ కేటగిరీలో అత్యధిక జన సముదాయం ఉన్న వర్గానికే ఇవ్వాలి అనే డిమాండ్ బాగాపెరిగిపోయింది. స్థానిక ప్రజలలో కూడా ఈ భావన వ్యాపించడం విశేషం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ, సింగరేణి గనులు వ్యాపించి ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఈసారి అర్హత కలిగిన స్థానిక నాయకుడికి అవకాశం ఇవ్వాలన్న భావనను గమనించిన పార్టీల అధినేతలు అదే వైపున ఆలోచిస్తున్నారని సమాచారం. ఈసారి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు అధికంగా ఉండడంతో ఆ పార్టీ టికెట్ కు డిమాండ్ పెరిగింది. దరఖాస్తులు కూడా అధికంగానే వచ్చాయి. అధిష్టానం వాటిని పరిశీలించి ఐదుగురితో కూడిన ఒక సూక్ష్మ జాబితాను తయారు చేసింది. చివరకు ప్రధాన పరిశీలనలో ఇద్దరు మాత్రమే ఉన్నారని సమాచారం. మాల వర్గం నుంచి టిక్కెట్ ఇవ్వాలనుకుంటే గడ్డం వంశీ, మాదిగ వర్గం నుంచి ఇవ్వాలనుకుంటే ప్రముఖ బిల్డరు, రియాల్టర్, సినీ నిర్మాత, మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాస్ జాబితాలో మిగిలారని తెలుస్తోంది.
వారికి నిరాశేనా
గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన చెలిమల సుగుణ కుమారి కొంతకాలం విదేశాలలో ఉండి ఇటీవలనే స్వదేశానికి తిరిగి వచ్చారు ఆమె ఇక్కడ నుంచి తిరిగి పోటీ చేయడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నప్పటికీ, అధిష్టానం అంతగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు టికెట్ ఇచ్చే విషయంలో కొంత చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఈసారి కొత్తగా అనుభవంలోకి వస్తున్న స్థానికత అంశం కాంగ్రెస్ అధిష్టానాన్ని కొంత ఆలోచనలో పడవేసిందని చెబుతున్నారు. దీంతో ఐదుగురి జాబితాను రెండుకు తగ్గించి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆసంపల్లి శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చినట్టయితే గెలుపు సులభం అవడమే కాకుండా స్థానిక నాయకుడికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని పార్టీ శ్రేణులు కూడా అధిష్టానానికి విన్నవిస్తున్నారని తెలుస్తోంది. సింగరేణి కార్మికుడిగా పనిచేసి పదవి విరమణ పొందిన ఆసంపల్లి నారాయణ కుమారుడు ఆసంపల్లి శ్రీనివాస్ కావడంతో సింగరేణి కార్మికుల సైతం శ్రీనివాస్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా ఓటర్లు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం ఆసంపల్లి శ్రీనివాస్ కు ప్లస్ పాయింట్ గా మారనుంది.