-మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
వీడియో జర్నలిస్టుల సంక్షేమం కోసం, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రెండు రోజుల క్రితం జరిగిన టివిజెఏ కార్యవర్గ ఎన్నికల్లో గెలుపొందిన ఆఫీస్ బేరర్లకు శ్రీనివాస్ రెడ్డి చేతులమీదుగా గెలుపు పత్రాలను మంగళవారం నాడు బషీర్ బాగ్ లోని దేశోద్దారక భవన్ లో అందించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆయా న్యూస్ ఛానెల్స్ లో పనిచేస్తున్న వందలాది వీడియో జర్నలిస్టులను ఏకం చేసి, అసోసియేషన్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. వీడియో జర్నలిస్టుల సంక్షేమం కోసం తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మీడియా రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగునంగా, వీడియో జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు వృత్తి గౌరవాన్ని పెంపొందించడానికి మీడియా అకాడమీ చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, 740మంది సభ్యులతో కొనసాగుతున్న వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ తమ సంఘానికి అనుబంధంగా పనిచేయడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. ఇంతమంది వీడియో జర్నలిస్టులకు ప్రాతినిద్యం వహిస్తున్న ఈ అసోసియేషన్, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆయా కమిటీల్లో వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ కు ప్రాతినిద్యం దక్కేలా తాము కృషి చేస్తున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేసారు. అలాగే ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల మంజూరీ కోసం టీయుడబ్ల్యూజే కృషి చేస్తుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్న్ అధికారి మోహన్ రాజ్ పిల్లయ్, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి, టివిజెఏ తాజా మాజీ అధ్యక్షుడు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు వనం నాగరాజు, అసోసియేషన్ నూతన అధ్యక్షుడు హరీష్ నండూరి, ఉపాధ్యక్షుడు పి. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పి.ఎస్.సన్నీ, సహాయ కార్యదర్శి వి.జనార్దన్ రెడ్డి, కోశాధికారి ఆర్. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి,
టీయుడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీలు సత్కరించారు.