విద్యావ్యవస్థలో సమూల మార్పులకు సర్కార్ శ్రీకారం..
డైట్ కు మహర్దశ..
మానకొండూరు ఎమ్మెల్యే
డాక్టర్ కవ్వంపల్లి..
మారుతున్న కాలమాన పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో 13.39 కోట్ల రూపాయలతో చేపట్టే ఆధునీకీరణ పనులకు జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాకడే తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యావ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఆ క్రమంలోనే ఇక్కడి డైట్ కు మహర్దశ పట్టనున్నదన్నారు. విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నదే సర్కార్ ముఖ్యోద్దేశమని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన విద్య లేకపోతే సమాజం నష్టపోతుందన్నారు. అన్నివృత్తుల్లో గౌరవ ప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తని, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే అవకాశం గురువులకే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. పాఠశాల తరగతి గదుల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ఒక విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఒక్క ఉపాధ్యాయునికి మాత్రమే ఉంటుందన్నారు. ప్రావీణ్యం గల ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని, అందుకే ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపల్ శ్రీరాం మొండయ్య, తిమ్మాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్హోత్ర, మహాత్మా నగర్ సర్పంచ్ పొన్నాల సంపత్, టీజీఈడ్ల్యూఐడీసీ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ కృష్ణకుమార్, ఏఈ సయ్యద్ మక్దుమ్, తదితరులు హాజరయ్యారు