(పొలిటికల్ ఫ్యాక్టరీ – వేములవాడ)
బీసీ సాధికారిత సంఘం డిమాండ్*
కార్పొరేషన్లకు నిధులు కేటాయించి ఉపాధి కల్పించాలి: కొండ దేవయ్య పటేల్
బీసీల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు.. కామారెడ్డి డిక్లరేషన్ హామీలు నెరవేర్చాలి
వేములవాడ రాజన్న సన్నిధిలో బీసీ నేతల సమావేశం.. బడ్జెట్ కేటాయింపులపై చర్చ
వలసలు ఆగాలంటే కులవృత్తులకు పూర్వవైభవం రావాలి: పొలాస నరేందర్
అంతరించిపోతున్న కుల చేతి వృత్తులను నమ్ముకుని ఉపాధి కరువై చితికిపోతున్న బీసీల బతుకులు బాగుపడాలంటే, ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో పెద్దపీట వేయాలని బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ కోరారు. వేములవాడ రాజన్న దర్శనానికి విచ్చేసిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్‌ను బీసీ నేతలు కొండ దేవయ్య పటేల్, పొలాస నరేందర్, ఇల్లందుల వెంకటేష్ తదితరులు శాలువాలతో ఘనంగా సత్కరించి రాజన్న చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల చేతి వృత్తుల బాగుకై ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కులవృత్తుల వారికి పూర్వవైభవం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉత్తర తెలంగాణ ఇంచార్జీ పొలాస నరేందర్ మాట్లాడుతూ.. కనుమరుగవుతున్న కులవృత్తుల వల్ల జీవనం అస్తవ్యస్తంగా మారి, ఉపాధి కోసం ప్రజలు గల్ఫ్ బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలసలను నిరోధించాలంటే కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు పాలకవర్గాలను నియమించి, నిధులు కేటాయించాలని సూచించారు. విద్యార్థులు, యువకులు, మహిళల సంక్షేమం దిశగా అడుగులు పడాలన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌పై బీసీలు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేయకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీ సాధికారిత సంఘం ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేష్‌తో పాటు పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.