సిద్దిపేట, ప్రతినిధి : మొత్తానికి మన మంత్రి హరీష్ హీరో అయ్యారు. హీరో బాలయ్య చెప్పే లాంటి డైలాగులు ఒక్కటంటే ఒకటే టేక్ చెప్పి ఔరా అనిపించారు. ‘పూడికతీస్తే చెరువుకు ఆరోగ్యం, ఆ మట్టిని పొలాల్లో వేస్తే రైతుకు సౌభాగ్యం.. చేయి చేయి కలిపిరండి.. వట్టిపోయిన చెరువులను పునరుద్ధరించుదాం’ అంటూ సింగిల్ టేక్‌లో షాట్ ఓకే చేశారు! ‘మిషన్ కాకతీయ’పై తీసిన లఘుచిత్రంలో మంత్రి హరీశ్ డైలాగులతో అదరగొట్టారు.
పాగా చుట్టి బొట్టు పెట్టి.. పలుగు పట్టి మట్టి తవ్విన సీన్లలో అచ్చం హరీష్ ఇంద్రలో మెగాస్టార్ చిరును తలపించారంటే నమ్మండి.. రియల్ హీరోలా ఆకట్టుకున్న మంత్రిని డైరెక్ట్ చేసింది ఎవరు అనుకుంటున్నారా.. మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ‘మిషన్ కాకతీయ’ పై తీసిన లఘు చిత్రంలో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ‘మిషన్ కాకతీయ’పై తీస్తున్న లఘుచిత్రం షూటింగ్ సందర్భంగా హరీశ్‌రావు డైలాగ్‌లతో రియల్ హీరోలా ఆకట్టుకున్నారు. మెదక్ జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఆదివారం ఈ లఘు చిత్రం షూటింగ్ జరిగింది.
మంత్రి తలపాగ చుట్టి… గడ్డపార చేతబట్టి… తవ్వి, పారతో తట్టలో మట్టినింపడం తదితర దృశ్యాలను ఈ సందర్భంగా చిత్రీకరించారు. ముందుగా చిన్నకోడూరు బురుజువద్ద, తర్వాత పెద్దచెరువు వద్ద ‘మిషన్ కాకతీయ’పై సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం తట్టలో పోసిన మట్టిని ఎత్తి కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తలపై పెట్టారు.
షూటింగ్ అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘మనిషి జీవించడానికి శరీరంలో గుండె ఎంత కీలకమో ప్రతి ఊరికి చెరువు అంతే’ అని ఉద్బోధించారు. తెలంగాణ రాష్ట్రంలో 2500 కోట్ల రూపాయలతో 4620 చెరువులను పునరుద్ధ్దరించనున్నట్లు చెప్పారు. కూరగాయల సాగులో మొక్కలు నాటే సీడింగ్ ప్లాంటర్ యంత్రం ద్వారా చేసే మల్చింగ్ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేసేందుకు కృషిచేస్తానని హరీశ్‌రావు అన్నారు.