ఢిల్లీ , ప్రతినిధి : దేశమంతా మోడీ ప్రభంజనమే.. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ హవానే… కానీ ఛత్తీస్గడ్ స్థానిక సంస్థల తాజా ఫలితాలు ఇదంతా తాత్కాలికమే అని తేల్చేశాయి. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఆపార్టీ మొత్తం 11 స్థానాల్లో పది ఎంపీలను గెలుచుకొంది. కానీ తాజా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. పది కార్పొరేషన్ల కు గాను నాలుగు, 39 మున్సిపాలిటీల్లో 16, 105 మున్సిపల్ పరిషత్తులకు గాను 37 మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. ఛత్తీస్గడ్ రాజధాని రాయ్ పూర్ కార్పొరేషన్ కాంగ్రెస్ వశమైతే.. రాయ్‌గఢ్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన హిజ్రా అభ్యర్థి బీజేపీపై గెలవడం మరో సంచలనం.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్
కొద్ది రోజులుగా వివిధ రాష్టాల ఎన్నికల్లో చావు దెబ్బ తింటున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ముఠా కుమ్ములాటలు లేకుండా ఉంటే మరికొన్ని స్థానాలనూ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునేదే అనే వాదనలు వినిపిస్తున్నాయి. 70 మున్సిపల్ పరిషత్తులను గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. అలాగే నాలుగు కార్పొరేషన్లు, 16 మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశ మయ్యాయి. మరో వైపు ఇండిపెండెంట్లు 18 మున్సిపల్ పరిషత్తులతో పాటు 7 పురపాలక సంఘాలు, రెండు మేయర్ పదవులు చేజిక్కుంచుకోగలిగారు.
అమిత్ షా ఎన్నికల్లో విస్తృత ప్రచారం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అయితే భద్రతా హెచ్చరికలను సైతం కాదని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రచారానికి హాజరయ్యారు. 2003లో రమణ్‌సింగ్ సీఎం అయిన తర్వాత ఇంతటి ఘోర పరాజయం బీజేపీకి ఎదురుకాలేదు. ఈ ఫలితాలు చాలు… దేశంలో మోడీ హవా తగ్గుతోందని చెప్పడానికంటూ… అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసేసింది.