కరీంనగర్ జిల్లాకు చెందిన మహేష్ రెడ్డి అనే వైద్యునికి ఇటీవల ఒక హృదయవిదారకమైన సంఘటన ఎదురైంది. అదేమంటే.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మహిళా రైతు (25 ఏండ్లు) తన భర్తతో గొడవ పడి క్షణికావేశంలో గడ్డి మందు తాగింది. అది గమనించిన సమీప బంధువులు ఆమెను వెంటనే ఈ మహేష్ రెడ్డి అనే వైద్యుని వద్దకు తీసుకువచ్చారు. గడ్డి మందు తాగేటప్పుడు ఆ మహిళ ఏం ఆలోచన చేసిందో ఏమో గానీ, ఈ డాక్టర్‌ను చూసేసరికి ఆమెకు భవిష్యత్తు కనపడింది. ఒక్కసారిగా ‘డాక్టర్ సార్ నాకిద్దరు చిన్న పిల్లలు, నేను లేకుంటే వాళ్లేమైపోతారు నీకు దండం పెడుతాను, దయచేసి నన్ను కాపాడండి’ అంటూ బోరున విలపిస్తూ ప్రాధేయడిందట! పాపం, ఈ డాక్టర్ మాత్రం ఏం చేస్తాడు? ఆమె తాగింది మామూలు గడ్డి మందు కాదు, విరుగుడు లేని విషం మందు ‘పారాక్వాట్’. ఈ మహిళ ఘటనే ఒక్కటే కాదు, ఇలాంటి ఘటనలు రోజుకు 2, 3 జరుగుతాయని ఆ డాక్టర్ చెప్తే విని గుండె తరుక్కుపోయింది. అంతేకాదు, ఇలాంటి ఘటనలను నిర్మూలించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనుకున్న ఆ డాక్టర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాడు. గడ్డిమందు (పారాక్వాట్) తాగితే దానికి విరుగుడు లేదని రైతులను చైతన్యపరుస్తున్నాడు. కరీంనగర్, వరంగల్‌లో శవపరీక్షలు నిర్వహించే వైద్యులను, గాంధీ దావఖానలోని ఒక ప్రొఫెసర్‌తో మాట్లాడితే.. వాళ్లూ… ‘పారాక్వాట్’ విరుగుడు లేని విషం మందు అని నిర్ధారించారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో ప్రతి నెల 10 నుంచి 20 మంది ఈ గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో 80 శాతం మంది ఈ మందే తాగుతున్నారని నా అధ్యయనంలో తేలింది.
పారాక్వాట్, గ్లైఫోసెట్, పెండిమిథాలిన్.. ఇవన్నీ గడ్డి మందులు. పంటలోని కలుపు మొక్కలను వినాశనం చేయడానికి ఉపయోగించే శక్తివంతమైన రసాయనాలు. ఇవి ఒడ్ల మీద ఉన్న గడ్డిని, పంటల్లో కలుపు మొక్కలను వేగంగా చంపేస్తాయి. లేదా కలుపు మొత్తం ఎండిపోయేలా చేస్తాయి. సులభంగా దొరకడం, కూలీల అవసరం లేకుండా ఒక్కరే పిచికారీ చేయడానికి అవకాశం ఉండటంతో రైతులు కలుపు నివారణకు ఈ గడ్డిమందులను ఇటీవలి కాలంలో ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఈ మందుల ప్రభావం ఆ కలుపు మొక్కలపైనే కాకుండా మనుషులపై, పర్యావరణంపై తీవ్రంగా ఉంటున్నది. ఈ విషయమై రైతుల్లో అవగాహన లోపించింది. కలుపు నివారణ తొందరగా అయిపోతుందన్న ఉద్దేశ్యంతో రైతులు వాడుతున్న ఈ గడ్డి మందులు మట్టిలో ఎక్కువ కాలం అలాగే ఉండిపోతాయి. ఫలితంగా భూమి సారం దెబ్బతింటున్నది. నేల చచ్చుబడిపోతుంది. దిగుబడి తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో పంటలకు పనికిరాకుండా పోతుంది. ఇక, వర్షాలు పడినప్పుడు పంటపొలాల్లోని వరద నీళ్లు వెళ్లి చెరువులో కలిసినప్పుడు ఆ నీళ్లు, తద్వారా భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. వీటన్నింటికి తోడు రైతులు ఈ మందులను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ మరో అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన అంశం ఏమిటంటే ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఈ గడ్డి మందులను ఒక సాధనంగా వాడుతున్నారు. ముఖ్యంగా పారాక్వాట్. ఇది సులభంగా లభ్యం కావడమే కాదు, అత్యంత విషపూరితమైనది కూడా కావడంతో, క్షణికావేశంలో దీనిని సేవించిన వారిని వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించడం అసాధ్యంగా మారుతోంది.
పారాక్వాట్ ఎంత ప్రమాదకరమంటే, పొరపాటున ఒక స్పూన్ మోతాదులో మింగినా మరణం సంభవించే అవకాశం ఉన్నది. దీనికి ఎటువంటి విరుగుడు లేదు. ఈ మందు శరీరంలోకి వెళ్ళిన వెంటనే ఊపిరితిత్తులు, మూత్రపిండాలను, కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారి బాధితుడు అత్యంత వేదనతో మరణిస్తాడు. పొలాల్లో మందు చల్లే సమయంలో ఇది చర్మం ద్వారా లేదా శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. రక్షణ కవచాలు (PPE Kits) లేకుండా దీనిని వాడటం వల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మం కాలిపోవడం, గోర్లు రాలిపోవడం, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అనేక అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం, పారాక్వాట్‌కు గురైన వ్యక్తుల్లో పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశం అధిక శాతం ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇది నరాల వ్యవస్థను దెబ్బతీసి, మనిషిని కదలకుండా చేస్తుంది. అందుకే ఇప్పటికే 70కి పైగా దేశాల్లో దీనిపై నిషేధం విధించారు.
భారతదేశంలో రసాయన కలుపు మందులు రాకముందు, మన రైతులు ప్రకృతితో ముడిపడి ఉన్న అత్యంత ప్రభావవంతమైన, పర్యావరణ హితమైన పద్ధతులను అనుసరించేవారు. ఈ పద్ధతులు కేవలం కలుపును నివారించడమే కాకుండా, భూమి సారాన్ని పెంచడానికి కూడా దోహదపడేవి. కూలీల సహాయంతో నేరుగా కలుపు మొక్కలను వేర్లతో సహా పీకివేయడం ఖర్చుతో కూడుకున్నదైనా, ప్రధాన పంటకు ఎటువంటి నష్టం కలగకుండా చేస్తుంది. ఎడ్ల సహాయంతో లేదా చిన్న చిన్న నాగళ్లతో వరుసల మధ్య ఉన్న కలుపును దున్నడం వల్ల నేల గుల్లబారి వేర్లకు గాలి అంది బలంగా పంట బాగా పెరిగేది. పంట కోత అనంతరం లేదా తోటలలో గొర్రెలను మేపడం ద్వారా కలుపును సహజంగా తొలగించవచ్చు. పైగా పశువులకు ఆహారం దొరుకుతుంది. అంతర పంటలు, పంట మార్పిడి, మల్చింగ్.. ఇలా ఎన్నో సహజసిద్ధమైన కలుపు నివారణ పద్ధతులున్నాయి. వీటిద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి లభించేది. అయితే వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో క్రమంగా ఇది తగ్గిపోయింది. ఒకప్పుడు పొలాల్లో ఒడ్ల మీద ఉన్న గడ్డిని పశువుల మేత కోసం కోసుకువెళ్లేవారు. ఇప్పుడు రైతుల దగ్గర పశువులు లేవు. గడ్డి అవసరం లేదు. కూలీలు దొరకట్లేదు. అందుకే కలుపు కనిపించిందంటే చాలు రైతులు గడ్డి మందులను ఆశ్రయిస్తున్నారు.
గడ్డి మందులపై పర్యావరణవేత్తలు, ఆరోగ్య శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల పంట ఉత్పత్తులు కూడా విషపూరితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ వస్తున్నారు. గ్లైఫోసెట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే గడ్డి మందు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని “క్యాన్సర్ కారకం కావచ్చు” అని గతంలోనే ప్రకటించింది. దీంతో, భారతదేశంలో దీని వాడకంపై ఆంక్షలు విధించారు. పెండిమెథాలిన్ అనే గడ్డి మందు విత్తనాలు మొలకెత్తక ముందే కలుపును నివారించడానికి దీనిని వాడుతుంటారు. తెలంగాణలో వరి సాగు పెరిగిన నేపథ్యంలో దీని వాడకం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. ఇది జలచరాలకు (చేపలు, కప్పలు, వానపాములు) అత్యంత విషపూరితమైనది. పొలాల్లో ఇబ్బడి ముబ్బడిగా దీన్ని చల్లడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు చనిపోయి దాని భూసారం దెబ్బతింటుంది.
కేంద్ర ప్రభుత్వం 2020లో ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేస్తూ, పారాక్వాట్‌తో సహా మొత్తం 27 రకాల పురుగుల మందులను, గడ్డి మందులను నిషేధించాలని ప్రతిపాదించింది. కానీ, వేటిపైనా పూర్తి నిషేధం లేదు. అయితే, తెలంగాణలో గ్లైఫోసెట్ వాడకంపై అప్రకటిత నిషేధం/ కఠిన నియంత్రణ ఉంది. కానీ, పారాక్వాట్ సులభంగా దొరుకుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు పారాక్వాట్ ను నిషేధిస్తున్న తరుణంలో, భారతదేశంలో దీనిని కొనసాగించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఆహార భద్రత ఎంత ముఖ్యమో, పౌరుల ఆరోగ్య భద్రత కూడా అంతే ముఖ్యం. కావున, ప్రభుత్వం తక్షణమే స్పందించి పారాక్వాట్ ఉత్పత్తి, విక్రయం, వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలి. అదే సమయంలో రైతులకు సహజసిద్ధ కలుపు నివారణ పద్ధతులపై అవగాహన కల్పించాలి. అందుకు అవసరమైన బ్రష్ కట్టర్ లాంటి యంత్రాలను అందించాలి.
ఈ పారాక్వాట్ గడ్డిమందును సేవించి రాష్ర్టవ్యాప్తంగా ఏటా సుమారు 2 వేల మంది చనిపోతున్నారని ఒక అంచనా. ఈ పారాక్వాట్ పర్యావసానాలను గుర్తించిన కేరళ, ఒరిస్సా, పంజాబ్ రాష్ర్టాలు ఇప్పటికే ఈ విరుగుడు లేని మందుపై నిషేధం విధించాయి. ఈ మందు పనితీరుపై నేను వ్యవసాయాధికారులు, వైద్యాధికారులతో మాట్లాడిన అనంతరం గత కొన్నిరోజులు మీడియా ముఖంగా మాట్లాడటం కూడా జరిగింది. ఆ వేదికగా ఈ విరుగుడు లేని పారాక్వాట్ మందును నిషేధించాలని ప్రభుత్వాన్ని కూడా కోరాను. ఇదిలా ఉంటే ఇటీవల ఐఎంఏ (ఇండియన్ మెడకల్ అసోసియేషన్) రాష్ర్ట కమిటీ కూడా విరుగుడు లేని ఈ మందును నిషేధించాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరింది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడుతుందని ఆశిస్తున్నా.
– బోయినపల్లి వినోద్ కుమార్
(వ్యాసకర్త: పార్లమెంట్ మాజీ సభ్యులు)